

Mana News, Nellore :- కడలి తీరంలోని ఇసుక తువ్వ నిర్మాణాలకు పనికి రాదని.. వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లేనని హెచ్చరిస్తారు. పైపెచ్చు లవణీయ స్వభావంతో నిర్మాణాల మనుగడకే ప్రమాదమని చెబుతుంటారు. కావలి నియోజకవర్గంలోని కొందరు బడా వ్యక్తులకు ఇదేమీ పట్టడం లేదు. కాసుల యావతో వివిధ అభివృద్ధి పనులకు సముద్రపు ఇసుకనే తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కావలి మండలంలోని ఒట్టూరు, లక్ష్మీపురం గ్రామాల్లో పొక్లెయిన్లతో తవ్వి.. యథేచ్ఛగా టిప్పర్లలో తరలిస్తున్నారు. పనుల ఒప్పందాల్లో పెన్నా ఇసుకను వినియోగిస్తామని చెప్పి.. ఇలా చేయడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలలు తాకే చోట.. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండటంతో.. సముద్రం కోతకు గురయ్యే అవకాశం ఉందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దీనిపై కావలి ఆర్డీవో ఎం.సన్నీవంశీకృష్ణ వివరణ కోరగా.. సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక తువ్వను తవ్వి నిర్మాణాలకు తరలించడం తగదన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.