మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి,సంప్రదాయ పద్ధతిలో చీరలు, గాజులు, పూలు,పండ్లు అందజేశారు. అనంతరం నూతనంగా జన్మించిన శిశువులకు అన్నప్రాసన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —
ఆరోగ్యవంతమైన,బలమైన సమాజ నిర్మాణం పౌష్టికాహారంతోనే సాధ్యమవుతుంది.తల్లి గర్భం నుంచే ఆరోగ్య సమాజానికి పునాది వేయాలి.తల్లి మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు బలంగా, ఆరోగ్యవంతంగా జన్మిస్తారు అని పేర్కొన్నారు.పిల్లలు, గర్భిణీలు,బాలింతలు,కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం,ఆరోగ్య అవగాహన పెంపొందించడం అత్యంత ముఖ్యమని అన్నారు.మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందని, వివిధ రకాల రోగాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మన పాత సంప్రదాయ ఆహారాలు — జొన్నలు, సజ్జలు,రాగులు, చిరుధాన్యాలు (మిల్లెట్స్) — మళ్లీ మన జీవితంలోకి తీసుకురావాలి అని సూచించారు.
ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని,గర్భిణీలు, బాలింతలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని తెలిపారు.జుక్కల్ నియోజకవర్గంలో 39,120 కుటుంబాలు అంగన్ వాడి వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.
అలాగే, 40 అంగన్ వాడి టాయిలెట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే వాటి నిర్మాణాలు పూర్తిచేస్తామని, నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణాలు కూడా చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రమీల, మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సిడిపిఓ సౌభాగ్య, కళావతి, సూపర్‌వైజర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.









