🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..!
ఉదయగిరి అక్టోబర్ 28 :(మన ధ్యాస న్యూస్)://

మొంథా తుఫాన్ ప్రభావంతో ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు తీవ్రమైన వర్షాలు, బలమైన ఈదురు గాలులు, తీవ్ర చలిగాలుల పరిస్థితుల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముందుకు వచ్చి, స్వయంగా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఆయన ఉదయగిరి మండలంలోని బిజ్జంపల్లి గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి, అక్కడ తాత్కాలికంగా ఆశ్రయం పొందిన బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. చలి కారణంగా ఇబ్బంది పడుతున్న 50 కుటుంబాలకు పైగా తక్షణ సాయంగా ఆయన స్వయంగా దుప్పట్లు, పండ్లు, తినుబండారాలు, తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు.ప్రజల సంక్షేమమే తన ప్రాధాన్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సాయం అందించేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, తక్షణ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఆయన స్థానిక అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది చలిని దృష్టిలో ఉంచుకుని పునరావాస కేంద్రాలలో తగిన వసతి, వైద్య సదుపాయాలు, నీరు, ఆహార పదార్థాలు నిరంతరం అందించాలంటూ సూచించారు.







