

Mana News :- ఖాతాదారులారా, సిద్ధంగా ఉండండి! మీ బ్యాంకింగ్ లావాదేవీలకు అంతరాయం కలగనుంది. మార్చి నెల చివర్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సంచలన ప్రకటన చేసింది . మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. తమ సమస్యలను పరిష్కరించడంలో IBA నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వారి సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోనుంది. దీంతో నగదు, చెక్కులు, ఆన్‌లైన్ బదిలీలు అన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకీ సమ్మె? ఉద్యోగుల డిమాండ్లు ఏమిటి? :- యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ సమ్మెకు నాయకత్వం వహిస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో చర్చలు విఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE) జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. చాలా కాలంగా బ్యాంక్ ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు. కానీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టక తప్పలేదు. వారి ప్రధాన డిమాండ్లు ఇవే:– బ్యాంక్ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారు. కారణం సిబ్బంది కొరత. అన్ని స్థాయిల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిపోతోంది. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రైవేట్ రంగంలో ఈ విధానం అమలవుతున్నప్పుడు, ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు ఎందుకు లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇది ఎంతో అవసరం. డైరెక్టర్ పోస్టుల నియామకం:– ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్‌మెన్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. పాలకమండలిలో ఉద్యోగుల ప్రాతినిధ్యం ఉండటం చాలా ముఖ్యం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) పనితీరు సమీక్షలు , ప్రోత్సాహకాలపై కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉద్యోగుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, వారిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంక్ బోర్డుల స్వయంప్రతిపత్తి:– DFS ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో “మైక్రో-మేనేజ్‌మెంట్” పేరుతో జోక్యం చేసుకోవడాన్ని UFBU తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది బ్యాంక్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని యూనియన్లు వాదిస్తున్నాయి. బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగితేనే సమర్థవంతంగా పనిచేయగలవు. ప్రభుత్వ జోక్యం పెరిగితే బ్యాంకుల పనితీరు మందగిస్తుంది. గ్రాట్యుటీ చట్టాన్ని సవరించి, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా గ్రాట్యుటీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, దీనిపై ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది ఎంతో అవసరం. సమ్మె ప్రభావం ఎలా ఉండబోతోంది? :- ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE),, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) వంటి ప్రధాన సంఘాలు పాల్గొంటున్నాయి. దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉంది. తాదారులు నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, ఆన్‌లైన్ బదిలీలు, క్రెడిట్ మరియు డెబిట్ కార్డు సేవలు వంటి వాటికి అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా, అత్యవసర నగదు అవసరమయ్యే వారు తీవ్ర ఇబ్బందులు పడతారు. వ్యాపార లావాదేవీలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ATMలు కూడా పనిచేయడం కష్టమవుతుంది. ఖాతాదారులకు హెచ్చరిక! :- సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున, ఖాతాదారులు తమ బ్యాంకింగ్ అవసరాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. మార్చి 24, 25 తేదీలలో అత్యవసర లావాదేవీల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వీలైనంత వరకు ఉపయోగించుకోండి. నగదు అవసరమైతే ముందుగానే డ్రా చేసుకోండి. చెక్కులు జారీ చేసేవారు, స్వీకరించేవారు కూడా ఈ సమ్మెను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలి. చూస్తుంటే, మార్చి చివరి వారంలో బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు సంభవించేలా ఉన్నాయి. ప్రభుత్వం, బ్యాంక్ సంఘాలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాయో వేచి చూడాలి. ఖాతాదారులకు మాత్రం ఈ సమ్మె పెద్ద తలనొప్పిగా మారనుంది. మీ డబ్బు, మీ లావాదేవీలు, మీ సమయం… అన్నీ సమ్మె ప్రభావంతో చిక్కుల్లో పడే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి!
