

Mana News , న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం ముదురుతోంది. ఎన్‌ఈపీపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయనపై పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఎన్‌ఈపీ కింద ప్రతిపాదిత త్రిభాషా ఫార్ములాపై ఇప్పటికే కేంద్రం, తమిళనాడు ప్రభుత్వ మధ్య డిబేట్ జరుగుతుంది. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నంగా దీనిని పేర్కొంటూ ఎన్‌ఈపీని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో డీఎంకే వైఖరిని లోక్‌సభలో ధర్మేంద్ర ప్రధాన్ తప్పుపట్టడంతో డీఎంకే ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్‌ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్‌కు నిధులను ఎన్‌ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ”మంత్రి (ధర్మేంద్ర ప్రధాన్) మమల్ని అబద్ధాలకోరులమని, అనాగరికులమని అంటున్నారు. మౌ గౌరవానికి ఆయన భంగం కలించారు. మేము ఏ భాషకూ వ్యతిరేకం కాదు. కానీ మీరు మమ్మల్ని అనాగరికులనే మాట అనకూడదు” అని కనిమొళి మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు? :- ధర్మేంద్ర ప్రధాన్ సోమవారంనాడు లోక్‌సభలో PM SHRI పథకంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు నిర్వహిస్తున్న పాఠశాలలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించిన PM SHRI పథకం అమలు విషయంలో తమిళనాడు ప్రభుత్వం మాటమార్చిందని ఆరోపించారు. వాళ్లలో (ప్రభుత్వం) నిజాయితీ లోపించిందని, తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. పథకం అమలుకు మొదట్లో అంగీకరించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అకస్మాత్తుగా సూపర్ సీఎం అవతరమెత్తి ‘యూటర్న్’ తీసుకున్నారని ఆరోపించారు. PM SHRI పథకం ఎంఓయూపై సంతకం చేసేందుకు తమిళనాడుకు మరో 20 రోజులు మాత్రమే వ్యవధి ఉన్నట్టు చెప్పారు.
