Mana News, ఇంటర్నెట్ డెస్క్: భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌పై వస్తున్న విమర్శలను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపడేశాడు. జట్టు కెప్టెన్‌గా రోహిత్ దూకుడుగా ఆడుతుంటే డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం భిన్నంగా ఉంటోందని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.అయితే, ఈ వ్యాఖ్యలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు. కేవలం 25 పరుగులతో కాదు.. 25 ఓవర్ల వరకూ క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలని సూచించాడు.”గత రెండేళ్లుగా రోహిత్ ఆడే తీరు ఇలానే ఉంటుంది. గత వన్డే ప్రపంచకప్‌ నుంచి ప్రారంభమైంది. ఇప్పటికీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. కొన్నిసార్లు విజయవంతమైనప్పటికీ.. అతడి టాలెంట్‌కు తగ్గ ఇన్నింగ్స్‌లు మాత్రం రావడం లేదు. ఇతరులతో పోలిస్తే అద్భుతమైన షాట్లు కొట్టగలిగే నైపుణ్యం అతడి సొంతం. ఇదంతా నేను అభిమానుల కోణంలో మాట్లాడా. అయితే, జట్టుపరంగా నేనేమీ మాట్లాడలేదు. ఒకవేళ అతడు కనీసం 25 ఓవర్లు క్రీజ్‌లో ఉంటే భారత్‌ కనీసం 180 నుంచి 200 పరుగులు చేస్తుంది. అప్పటికి కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఉందనుకుందాం.. ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు దూకుడుగా ఆడే అవకాశం ఉంటుంది. అప్పుడు 350 పరుగులను చేరడం చాలా సులువవుతుంది. ఇప్పుడు రోహిత్‌ను దూకుడుగా ఆడవద్దని చెప్పడం లేదు. కానీ, సగం ఓవర్ల వరకైనా అతడు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడు భారత్‌ విజయంపై తప్పకుండా ప్రభావం చూపిస్తాడు. ఓ బ్యాటర్‌గా నువ్వు 25-30 పరుగులతో సంతోషంగా ఉండగలవా? ఉండలేవని అనుకుంటున్నా. అందుకే, నేనొక మాట చెబుతున్నా. నీ ప్రభావం ఎక్కువగా ఉండాలంటే ఎప్పుడు ఏడెనిమిది ఓవర్లలోనే ఔట్ కాకూడదు.” అని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *