చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 23: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా పరిషత్ సిఇఓ రవికుమార్ తెలిపారు. గురువారం ఆయనను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్, జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కలిసి వివిధ సమస్యలపై ప్రాతినిధ్యం చేసింది. ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు పిఎఫ్ తుది మొత్తాలు పొందడంలో నెలల తరబడి ఆలస్యం ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిస్సింగ్ క్రెడిట్స్ క్రమబద్ధీకరణ, పిఎఫ్ రుణాల మంజూరులో జాప్యం, అకాల మరణం పొందిన టీచర్ల కుటుంబాలకు కారుణ్య నియామకాల ఆలస్యం వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, డీఎస్సీ-2025 ద్వారా టీచర్లుగా ఎంపికైన ఇన్ సర్వీస్ ఉద్యోగులను రిలీవ్ చేయడంలో సానుకూలత చూపించాలని విజ్ఞప్తి చేశారు. సిఇఓ రవికుమార్ స్పందిస్తూ, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయి ఆర్థిక ప్రయోజనాలను త్వరగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పిఎఫ్ మిస్సింగ్ క్రెడిట్స్ క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. పిఎఫ్ ఖాతాల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రత్యేక వెబ్‌సైట్‌ను సిద్ధం చేశామని వెల్లడించారు. అలాగే, కారుణ్య నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని, ఎంపికైన వారసులకు త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు లక్ష్మీపతి, అమర్నాథ్ రెడ్డి, గుణశేఖర్, బాలచంద్రారెడ్డి, వాసు తదితరులు, పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.








