తవణంపల్లి, మన ధ్యాస అక్టోబర్ 23: డిసెంబరు 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. మహాసభలను పురస్కరించుకుని తవణంపల్లి మండలం కృష్ణాపురంలో గురువారం మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన బ్రాంచ్ సమావేశంలో సురేంద్రనాథ్ మాట్లాడుతూ దేశంలో పేదలపై దాడులు, ఎస్సీ ఎస్టీలపై దౌర్జన్యాలు, మహిళలపై హింసలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మతతత్వం, మనువాదం పేరుతో ప్రజలను విభజిస్తూ, హిందుత్వ ముసుగులో ఆర్ఎస్ఎస్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్యమానికి ఈ మహాసభలు వేదికవుతాయని వివరించారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి, సంక్షేమం కనబడడం లేదని, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి, కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర సంపదను అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. లాభాల్లో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే, స్మార్ట్ మీటర్ల వ్యవహారాలను కార్పొరేట్ ప్రయోజనాలకే వాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు వంటి ప్రజా ఆస్తుల విషయంలో నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్నారని సురేంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. మత్స్యకారులపై కాల్పులు జరిపి, ఆదానీ కంపెనీకి పోర్టును అప్పగించడం ప్రజావ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. జిల్లా కమిటీ సభ్యురాలు సుగుణ మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు పెరిగి పోతున్నాయని, ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో విఫలమయ్యాయని అన్నారు. చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా కూడా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకం అయితేనే న్యాయం సాధ్యమవుతుందని, ఎర్ర జెండా అండగా ప్రజా పోరాటం కొనసాగుతుందని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళి, శ్యామల, సురేష్, రాణి, అమర, మొగలేశ్వరి తదితర పార్టీ సభ్యులు పాల్గొన్నారు.







