Mana News, న్యూఢిల్లీ: కర్ణాటక లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యూఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను మంగళవారంనాడు కలుసుకున్నారు.డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాకుండా ఎవరూ ఆపలేరంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీరప్ప మొయిలీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో ఖర్గేను డీకే కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రోటాకాల్ ప్రకారమే కలిసా..కాగా, ఖర్గేతో సమావేశంపై డీకే మాట్లాడుతూ, ప్రోటోకాల్ ప్రకారమే తాను ఖర్గేను కలుసుకున్నట్టు చెప్పారు. ”ఆయన మా నాయకుడు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన దగ్గరకు వెళ్లి కలుసుకున్నాను” అని తెలిపారు. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం శంకుస్థాపనకు కోసం ఆయనను ఆహ్వానించినట్టు చెప్పారు. ఇవాళో..రేపో.. డీకే శివకుమార్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఆయనను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని వీరప్పమొయిలీ గత ఆదివారంనాడు తెలిపారు. ఇప్పటికీ సమర్ధుడైన నాయకుడిగా డీకే తనను తాను నిరూపించుకున్నారని, ఆయన ముఖ్యమంత్రి కావడం కాలపరిమితికి సంబంధించిన అంశమని, ఇవాళో, రేపే అది కూడాజరగవచ్చని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై డీకే మాత్రం ఆచితూచి స్పందించారు. వీరప్ప మొయిలీ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారని, దాని గురించి తాను మాట్లాడేదేమీ లేదని అన్నారు. ఖర్గే ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగసైతం డీకేకు సీఎంగా పదోన్నతి తథ్యమని, డిసెంబర్‌లో అది జరగవచ్చని జోస్యం చెప్పారు.









