కుప్పం, మన ధ్యాస : దీపావళి రహస్యం జ్ఞాన జ్యోతిని వెలిగించడమేనని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కుప్పం కుప్పం కమిటీ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ధన త్రయోదశి నాడు కుప్పం, శివరాంపురం కమిటీలు సంయుక్తంగా త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పం మండలం గరిగచేనేపల్లి గ్రామంలో జరిగిన త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రబోధానంద యోగీశ్వరులు రచించినటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీతతో పాటు పలు దైవ గ్రంథాల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా వారు దీపావళి పండుగ రహస్యాన్ని వివరిస్తూ… దీపావళి పండుగ పూట ప్రతి ఇంట దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని, దీని వెనుక ప్రత్యేక పరమార్థం ఉందన్నారు. దైవాన్ని ఇంటికి ఆహ్వానిస్తూ దీపాలు వెలిగిస్తామని తెలుపుతూ, ఇంటిని మానవ శరీరంతో పోల్చారు. ఇంటిలోకి దైవాన్ని ఆహ్వానిస్తూ దీపాలు వెలిగించినట్టుగానే మానవుడు మనసులో దైవాన్ని నింపుకోవాలని సూచించారు. ఇందుకు ఏకైక మార్గం దైవ జ్ఞానాన్ని తెలుసుకోవడమేనని, ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి, వాటి పరమార్థాన్ని గ్రహించి మోక్ష మార్గాన్ని పొందాలని ఆశించారు. దైవ జ్ఞానాన్ని పొందిన వారిలో ప్రతినిత్యం జ్ఞాన జ్యోతి వెలుగుతూనే ఉంటుందని, అలాంటివారు మాత్రమే మోక్ష మార్గాన్ని పొందుతారని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ దైవ జ్ఞానాన్ని పొంది, జ్ఞాన జ్యోతిని తమ మనసులో వెలిగించుకుని, దైవానుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి – ఇందూ జ్ఞాన వేదిక కుప్పం కమిటీ సభ్యులు ప్రకాష్, కృష్ణారెడ్డి, శరవణ, రాజ్ కుమార్, కృష్ణమూర్తి, ఇందిరా, వెంకటలక్ష్మి, పూజ, మైత్రి లు పాల్గొన్నారు.







