ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక

దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం

రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక

వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి 

సీమ అభివృద్ధి పై పేటెంట్ మాదేనన్న సీఎం

అనంతలో కూటమి సూపర్ సిక్స్ -సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు ఉత్సాహభరిత ప్రసంగం

ఉరవకొండ మన ధ్యాస:  కూటమి పార్టీలు తొలిసారిగా ఉమ్మడిగా అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ అదరహో అనిపించింది. బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో తమ హిట్ కాంబినేషన్ కొనసాగుతుందని కూటమి నేతలు సభా వేదికగా ప్రకటించారు. అనంతపురంలోని ఇంద్రప్రస్తానగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి 15 నెలల పాలనా విజయాలపై ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ బంపర్ హిట్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. బుధవారం మద్యాహ్నం 3 గంటలకు సభా వేదికపైకి వస్తూనే కూటమి అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ లు సూపర్ సిక్స్ జెండాలతో  ర్యాంప్ పైకి వెళ్లి పార్టీ శ్రేణులకు, ప్రజలకు అభివాదం చేశారు. జెండాలు ఊపుతూ ఉత్సాహ పరిచారు. ప్రతిగా ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి అమితమైన స్పందన కనిపించింది. ఈలలు వేస్తూ, జైసీబీఎన్, పవన్ కల్యాణ్ అంటూ నినాదాలతో విజయోత్సవ సభా ప్రాంగణం మార్మోగింది. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు రామరాజ్యం లక్ష్యంగానే కూటమి పరిపాలన సాగుతుందని ప్రకటించారు. సభా వేదిక నుంచి ఆటో డ్రైవర్లకు అనుకోని కానుకను ప్రకటించారు. దసరా రోజున ఆటో డ్రైవర్లందరి కి ఆర్ధిక సాయం కింద రూ.15 వేల రూపాయల్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఏటా ఈ మొత్తాన్ని ఆర్ధికసాయంగా వారికి అందుతుందని స్పష్టం చేశారు. సీఎం మాట్లాడుతూ.. “అకుంఠిత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. ప్రజలకు న్యాయం చేయాలి.. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలన్నదే నా ఆలోచన పవన్ కల్యాణ్ ఆలోచన.
ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యం. రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రదాని నరేంద్ర మోదీ అన్ని విధాలలా అండగా ఉన్నారు.
ఈ సభా వేదికగా ప్రధాని మోదికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడు పార్టీల కార్యకర్తలు, నేతలకు ఒకమాట చెపుతున్నా…మీరంతా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా పాలన అందిస్తున్నాం. మనం పాలకులం కాదు. సేవకులం ..మనం పెత్తందారులం కాదు.. ప్రజల భవిష్యత్ కోసం పని చేసేవాళ్లం. అహంకారం, అవినీతి, అలసత్వం, అసంతృప్తి అనేది మన దరికి రానివ్వొద్దు. ఏ పొరపాటూ చేయొద్దు. జెండాలు మోసే మూడు పార్టీల కార్యకర్తలకు న్యాయం చేయడం మా బాధ్యత. ఐకమత్యంతో ఉండాలి…కలిసి ఉంటేనే మనకు బలం.
పీ4 కార్యక్రమంలో అంతా భాగస్వాములు అవ్వాలని కోరుతున్నా…సమాజానికి కొంత తిరిగిద్దాం. రామరాజ్యం లాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్, మాధవ్ ది.
నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు…కామన్ మాన్. ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ లా ఉండాలి. ఎన్నికలకంటే మన పరపతి పెరిగింది.. ఇది శాశ్వతంగా ఉండాలి.  * ఎమ్మెల్యే తప్పు చేసినా.. కార్యకర్త తప్పు చేసినా… అధికారి తప్పు చేసినా… ప్రభుత్వానికే చెడ్డ పేరు. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్..అభివృద్ది సూపర్ హిట్. కలిసి  పోటీ చేశాం. కలిసి గెలిచాం కలిసి పనిచేస్తాం” అని ముఖ్యమంత్రి అన్నారు.

*సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు*

గత పాలకులు ఓట్ల కోసమే సంక్షేమం చేశారని.. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరం తీర్చడం కాదని సీఎం అన్నారు. ఈ విజయోత్సవ సభకు కారణమైన  స్త్రీశక్తికి వందనం, యువత పోరాటాలకు వందనం, అండగా నిలిచిన అన్నదాతకు వందనం, ప్రతి తల్లికీ వందనం, కార్యకర్తల కష్టానికి, త్యాగానికి వందనం  అని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై మాట్లాడుతూ”  బాధ్యత గల ప్రభుత్వంగా  ఇచ్చిన మాటను నెరవేర్చిందని చెప్పడానికే ఇక్కడకు వచ్చాం.  నేపాల్ ఆందోళనల్లో 200 మంది తెలుగు వారు చిక్కుకుపోయారు. మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ నుంచి పర్యవేక్షిస్తున్నందున సభకు రాలేకపోయారు. తెలుగువారిని స్వస్థలాలకు తీసుకవచ్చేలా ఆయన బాధ్యత తీసుకున్నారు.  అన్ని వర్గాలతో చర్చించి 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు తెచ్చాం. 2023, మే నెల 28న రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం. అదే సమయంలో కూటమి మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లి  ప్రజా తీర్పు కోరాం. 2024 ఎన్నికలు చరిత్రను తిరగ రాశాయి. కనీ వినీ ఎరుగని రీతిలో 57 శాతం ఓట్ షేర్, 93 శాతం స్ట్రైక్ రేట్‌తో 164 అసెంబ్లీ సీట్లు గెలిపించారు. 21 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నాం. ప్రతి పక్షానికి హోదా లేకుండా చేసిన మీకు అభినందనలు.  గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టివేసింది. రూ. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై దురాగతాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలు నిలిపివేశారు. నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్ తెచ్చిపెట్టారు. 15 నెలలుగా అనేక సవాళ్లను అధిగమించి ఒక్కో అడుగు వేస్తూ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నాం. నిర్వీర్యమైన వ్యవస్థలను సరిదిద్ది…మాట ఇచ్చినట్లు అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చే సూపర్ సిక్స్ అమలుచేశాం.అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నాం. “అని ముఖ్యమంత్రి అన్నారు.

సూపర్ సిక్స్ – బంపర్ హిట్

“సూపర్ సిక్స్ అంటే హేళన చేశారు. పింఛన్ల పెంపు అంటే అసాధ్యం అన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారు. మెగా డీఎస్సీ అవ్వదన్నారు… దీపం వెలగదన్నారు… ఫ్రీ బస్సు కదలదన్నారు. ఇవన్నీ నిజం చేశాం. కోట్ల మంది లబ్ది పొందారు.  ఏ వ్యక్తి జీవితాన్ని అయినా, ఏ కుటుంబ స్థితిగతులను అయినా మార్చేది చదువు. ప్రతి పేద బిడ్డా చదవాలని ‘తల్లికి వందనం’ తీసుకువచ్చాం. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా, పరిమితులు లేకుండా అందరికీ రూ. 15 వేలు చొప్పున అందించాం. 67 లక్షల మంది విద్యార్ధుల చదువులకు ఒకేసారి రూ.10 వేల కోట్లు ఇచ్చాం.  ఇది 10 వేల కోట్ల పథకం కాదు…మీ బిడ్డల బంగారు భవిష్యత్ కు ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి. తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టే ‘తల్లికి వందనం’ సూపర్ హిట్. నాడు బాబే మీ డ్రైవర్ అన్నాను. చెప్పినట్లు గానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. నా తెలుగింటి ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం… ఎక్కడికైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్లి రావొచ్చు. ఇప్పటివరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్సు ఎక్కారు. రూ.175 కోట్ల మేర మహిళలకు ఆదా అయ్యింది. మీకు ఆర్థిక వెసులుబాటును, గౌరవాన్ని పెంచేందుకు తెచ్చిందే స్త్రీ శక్తి. ఫ్రీ బస్ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది కాబట్టే ‘స్తీశక్తి’ సూపర్ హిట్ అయ్యింది. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎన్డీఏ కూటమికి రైతే రాజు. మనకు అన్నంపెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చాం. కేంద్రంతో కలిసి ఏడాదికి 3 విడతల్లో రూ. 20 వేలు ఇస్తామన్నాం. తొలి విడతగా ఇప్పటికే రూ. 7 వేలు ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశాం.  అనంతపురం రైతాంగానికి నీళ్లు అందాయి.  ఏ రైతుకు యూరియా కొరత రానివ్వకుండా నేను బాధ్యత తీసుకుంటాను.  కేంద్రం మన అవసరం మేరకు యూరియా అందిస్తోంది. ఆర్ధిక కష్టాలున్నా…అండగా నిలిచాం కాబట్టే అన్నదాత సుఖీభవ సూపర్ హిట్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పటికే రూ.1704 కోట్లు ఖర్చు చేసి… 2.45 కోట్ల ఉచిత  సిలిండర్లు మహిళలకు ఇచ్చాం. ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే… ‘దీపం 2’ సూపర్ హిట్ అయ్యింది.  20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని  చెప్పాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలోనే భర్తీ చేశాం. ఒక్క రూపాయి అవినీతి లేకుండా మెరిట్ ఆధారంగా ఇచ్చాం. యువత అండగా ఉంటే కొండలను బద్దలు కొడతాం. నైపుణ్య శిక్షణ ద్వారా 1 లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేస్తే…. మనం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇది మన బ్రాండ్. యువత మేలుకోవాలి. మీ భవిష్యత్ ను బంగారు భవిష్యత్ చేసే బాధ్యత ప్రభుత్వానిది. యువత భవితకు భరోసా ఇచ్చాం కాబట్టే…యువగళం సూపర్ హిట్ అయ్యింది. అని సీఎం వ్యాఖ్యానించారు.

పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణలు

” నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు ఐటీ ఉద్యోగిని తయారు చేశాం. దీంతో తలసరి ఆదాయం పెరిగి పేదరికం తగ్గింది. ఈసారి ప్రతీ ఇంటికో పారిశ్రామిక వేత్తను చూడాలనేది నా సంకల్పం.  లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. ఈ లక్ష్యం సాధిస్తాం. భారత దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం మనం ఇస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్లు’. ‘పేదల సేవలో’ భాగంగా ప్రతీ నెలా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఒక్క పింఛన్ల పంపిణీకే ఇప్పటి వరకు సుమారు రూ.45 వేల కోట్లు ఖర్చు చేశాం. పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. వీటి ద్వారా ఇప్పటివరకు 5.60 కోట్ల భోజనాలతో కడుపు నింపాం. పేదలకు రూ. 5 కే భోజనం పెడితే ఇంతకంటే ఆనందం ఏముంది. గత ప్రభుత్వంలో పేదల పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రభుత్వం. అందరి జీవితాలు మార్చే ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల జీవితాలను మార్చేలా సంస్కరణలు తెస్తున్నాయి. ఎన్డీఏ  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోట్ల మంది పేదల కొనుగోలు శక్తి పెంచుతుంది. పేదలను పైకి తీసుకురావాలని , ఆదాయం పెంచాలని ముందుకొచ్చాం.  ఇదే స్ఫూర్తితో యూనివర్సల్ హెల్త్ స్కీం తెచ్చాం. దీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయి. పేదలందరికీ రూ. 25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సాయం చేస్తాం.  ప్రతి వ్యక్తి ఆరోగ్యయం కాపాడాలనే లక్ష్యంతో  కొత్తగా సంజీవని ప్రాజెక్టు తెస్తున్నాం.”  అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు

భూమి ఇస్తే మెడికల్ కాలేజీ ఉన్నట్టేనా

రాష్ట్రంలో మెడికల్ కాలేజీ అంటే తెలియని నాయకుడు ఉన్నాడు. భూమి ఇస్తే మెడికల్ కాలేజీ పూర్తికాదు. రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం టీడీపీ. రాష్ట్రంలో 17 కాలేజీలు ఉంటే పాడేరులో ఒకటి మాత్రమే మొదలుపెట్టాం. మిగిలిన 16 అలాగే ఉన్నాయి. శంకుస్థాపన చేసి రిబ్బన్ కట్ చేస్తే కాలేజీలు నిర్మించినట్టేనా..అందుకే పీపీపీ విధానం తెచ్చాం. 2026-27 నాటికి 4 కాలేజీలు, 2027-2028 నాటికి 7 కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. అసెంబ్లీకి రండి మొత్తం తేలిపోతుంది. టీడీపీకి వెన్నుముక బీసీ సోదరులు. బీసీల అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. ఎస్సీ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణను ఎవరికీ నష్టం లేకుండా పూర్తి చేశాం. ఎస్టీల జీవన ప్రమాణాలు పెంచుతున్నాం. సామాజిక న్యాయం మా ధ్యేయం. వాట్సాప్ గవర్నెర్స్ ద్వారా 700 ప్రభుత్వ సేవలు పౌరులకు అందుబాటులోకి తెచ్చాం. డబుల్ ఇంజన్ సర్కార్ తో డబుల్ డిజిట్ గ్రోత్ . కేంద్రంలో, రాష్ట్రంలో మన ప్రభుత్వాలే ఉండటంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది.  2025-26 లో 10.5 శాతం జీఎస్ డీపీ గ్రోత్ రేటు వచ్చింది. ఆల్ ఇండియాలో 8.8 శాతం ఉంటే ఉండగా మనం 10.5 శాతానికి వచ్చాం. అదీ కూటమి ప్రభుత్వ సత్తా” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రప్పారప్పా అంటే ప్రజలు వారి బెండు తీశారు

“సంక్షేమంలో కూటమి దూకుడుతో వైసీపీ ఉనికి కోల్పోతోంది. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజలను మోసం చేయాలి చూస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుతగులుతోంది. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని….సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారు. సిద్ధం సిద్ధం అని ఎగిరిపడిన వాళ్లను, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటే… కిక్కురుమనడం లేదు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్లు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రతిపక్షహోదా, ముఖ్యమంత్రి పదవి ప్రజలిచ్చేవి అని వారికి తెలియదా . ప్రజలందరూ జగన్ రెడ్డికి క్లాస్ తీసుకోవాలి.  శాసన సభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలు వేస్తున్నారు. ఇక్కడుంది సీబీఎన్, పవన్ కల్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డలను అవమానిస్తే ఖబడ్దార్. అవమానిస్తే 5 నిమిషాల్లో పోలీసులు మీ చొక్కాలు పట్టుకుంటారు. ఆడబిడ్డలను అవమానించేవాళ్లను శిక్షించొద్దా? వీళ్ల తీరు మారలేదు కాబట్టే పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో  బెండు తీశారు. ప్రజా స్వామ్యంలో హింసారాజకీయాలు చెల్లవు.  వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి  దగ్గరికి వెళితే ధృతరాష్ట్ర కౌగిలికి బలి అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెపుతున్నా” అని ముఖ్యమంత్రి అన్నారు.

సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్

హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు తెలుగు దేశం హాయంలో వచ్చినవే. సీమ పల్లెల్లో ఫ్యాక్షన్ అంతం చేసినా…నీళ్లు తెచ్చినా ఆ ఘనత మనదే. సీమలో అన్ని చెరువుల్లోకి నీరు వస్తోంది. భవిష్యత్ లో  52 సీట్లు మనమే గెలవ బోతున్నాం. 15 నెలల పాలనతో సీమలో కూటమి మరింత బలపడింది. సాగునీటి ప్రాజెక్టులతో ఎడారి నేలకు జీవం పోశాం. కియా కార్ల పరిశ్రమ తెచ్చాం. అనంతను దేశంలో బ్రాండ్ చేశాం. నేడు మళ్లీ సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ అమలు చేస్తున్నాం. రూ. 3850 కోట్లతో హంద్రీ నీవా ద్వారా కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకువెళ్లాం. 5 ఏళ్లు వాళ్లు చేయలేని పనిని 100 రోజుల్లో చేశాం.  మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటి ఆధునిక దేవాలయాలు. సమర్థ నీటి నిర్వహణతో సీమకు జలకళ తెచ్చాం. దీన్ని శాశ్వతం చేస్తాం. ఎవరు అడ్డుపడినా సీమ అభివృద్ది ఆగదు. సూపర్ సిక్స్ సభ సూపర్ హిట్ చేసిన అనంతపురం జిల్లాకు ధన్యవాదాలు. జీడిపల్లి, భైరవానితిప్ప ఎత్తిపోతల పథకం, జీడిపల్లి, పేరూర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడతాం.  ఉరవకొండ, కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు నీరిచ్చేలా హంద్రినీవా 36 ఏబీసీ ప్యాకేజీలపై దృష్టి పెడతాం. మడకశిర బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణపై దృష్టి పెడతాం” అని ముఖ్యమంత్రి తెలిపారు.

Related Posts

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు