

Mana News :- వరంగల్: జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్వగ్రామానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని మార్గ మధ్యలోనే మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మృతి చెందగా, భార్య ప్రాణాలతో బయటపడింది. వివరాల్లో వెళితే.. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్ కుటుంబంతో సహా హనుమకొండలో ఉంటున్నారు. శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు భార్య, పిల్లలతో కలిసి కారులో బయలుదేరారు. సంగెం మండలం తీగరాజుపల్లి వద్దకు రాగానే ప్రవీణ్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుందామని వెనుదిరిగారు. యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలో పడింది. కాల్వలో కొట్టుకుపోతున్న కృష్ణవేణిని స్థానికులు గమనించి రక్షించారు. సాయివర్ధన్ (2) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రవీణ్ (34), కుమార్తె ఛైత్రసాయి(4) గల్లంతయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాలువలో నీటి ప్రవాహన్నా తగ్గించి గాలింపు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సాయంతో కారుతో పాటు గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఘటనా స్థలిలో కుమారుడు సాయివర్ధన్ మృతదేహాన్ని హత్తుకుని కృష్ణవేణి రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సంతోషంగా స్వగ్రామానికి వెళ్తోన్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేయడంతో ప్రవీణ్ స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు.
