

Mana News :- SBI: రోజురోజుకీ సైబార్ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. కొంగొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఇందులో భాగంగానే ఓ పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఎస్‌బీఐ బ్యాంక్ పేరుతో సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు వ్యాపిస్తున్నాయని, అందులో ఉన్నతాధికారులను ఉటంకిస్తూ నకిలీ పెట్టుబడి పథకాలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. తమ బ్యాంకు అధిక వడ్డీ లాభాలు అందించే ఏ పెట్టుబడి పథకాన్నీ ఆమోదించలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనల వల్ల ప్రజలు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఉపయోగించి కొన్ని ఫేక్ వీడియోలను రూపొందిస్తున్నారు. అచ్చంగా నిజమైన వ్యక్తుల్లా కనిపించే వీడియోలను రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ఏఐతో తయారు చేసిన వీడియోలను చాలా సింపుల్‌గా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాయిస్‌లో తేడాలు, ముఖ కవలికల్లో తేడాలతో ఫేక్ వీడియోలను సింపుల్‌గా గుర్తించవచ్చని చెబుతున్నారు. అందుకే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏ సమాచారాన్నైనా అధికారిక వెబ్‌సైట్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌ల్లోనే పొందాలని సూచిస్తున్నారు. అధిక లాభాలను హామీ ఇచ్చే పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యే బ్యాంకు సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ లేదా స్థానికంగా ఉన్న బ్రాంచ్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.