

Mana News, ఇంటర్నెట్ డెస్క్: ప్రతిపక్షాల నిరసనలతో సెర్బియా పార్లమెంటు (Serbia Parliament) అట్టుడుకింది. స్మోక్ బాంబులు, మండే స్వభావం కలిగిన ఇతర వస్తువులు విసరడంతో రణరంగంగా మారింది.వీటితోపాటు కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లనూ చట్టసభ సభ్యులు విసురుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు ఎంపీలకు గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. యూనివర్సిటీ విద్యకు నిధులు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్ సమయంలో పార్లమెంటులో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతోపాటు అనేక నిర్ణయాలను ఆమోదించే యోచనలో అధికార పార్టీ ఉందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. ఇది చట్టవిరుద్ధమని, ప్రధాని మిలోస్ వుచెవిక్ రాజీనామాను వెంటనే ఆమెదించాలని డిమాండ్ చేశారు. బ్యానర్లు చేతపట్టి, నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్మోక్ బాంబులు (Smoke Bombs) విసరడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కోడిగుడ్లు, నీళ్లబాటిళ్లు కూడా విసురుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు ఎంపీలకు గాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు ప్రకటించారు. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన స్పీకర్ అనా బ్రనాబిక్.. ప్రతిపక్షాలను ఉగ్రవాద ముఠాలుగా పేర్కొన్నారు.సెర్బియాలోని నోవీసాడ్ నగరంలో గత నవంబర్‌లో ఓ రైల్వేస్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 15 మంది మరణించినప్పటి నుంచి విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం ఉద్ధృత రూపు దాల్చింది. ఉద్యమ తీవ్రతకు తలొగ్గిన ప్రధానమంత్రి మిలోస్ వుచెవిచ్ ఇటీవల రాజీనామా చేసినప్పటికీ.. పార్లమెంటు దీన్ని ఆమోదించాల్సి ఉంది. 30 రోజుల్లో ఆమోదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచడమా లేక మధ్యంతర ఎన్నికలు జరిపించడమా అన్నది తేల్చాల్సి ఉంది. మరోవైపు విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, న్యాయవాదులు, నటులు సహా అనేక రంగాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.