

Mana News, ఇంటర్నెట్‌డెస్క్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత్‌లో అడుగుపెట్టే వేళ.. ఆటో మొబైల్స్‌పై కీలక నిర్ణయాలు వెలువడవచ్చు. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.మరోవైపు భారత్ మాత్రం తక్షణమే సుంకాలను పూర్తిగా తొలగించే విషయంలో ఆచితూచి స్పందిస్తోంది.త్వరలో భారత్-అమెరికా అధికారుల మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో టారిఫ్‌లు కీలక అంశంగా మారనున్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. వీటితో టెస్లా భారత మార్కెట్లోకి వచ్చేందుకు మార్గం సుగమం కానున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం భారత్ కార్ల దిగుమతిపై 110శాతం సుంకాలు విధిస్తోంది. ఈ విషయంపై ఎలాన్ మస్క్ ఇప్పటికే పలుమార్లు భారత్‌పై బహిరంగానే విమర్శలు చేశాడు. ప్రపంచంలోనే కార్లపై అత్యధిక సుంకాలు విధించే దేశంగా అభివర్ణించాడు. తాజాగా ఆయన అమెరికాలోని డోజ్ విభాగానికి సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాడు. ఇక ట్రంప్ కూడా భారత్‌ను ఆటో టారిఫ్‌లపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇటీవల ఆ దేశ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచరించారు. ఈనేపథ్యంలో అమెరికా వర్గాలు భారత్‌లో చాలా రంగాల్లో సుంకాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆటో మొబైల్ రంగంపై జీరో టారిఫ్ అమలవుతుందని భావిస్తున్నారు.
అమెరికా సుంకాల వడ్డనపై భారత్ జాగ్రత్తగా స్పందిస్తోంది. స్థానిక పరిశ్రమలతో మాట్లాడి దీనిపై ఓ విధానం తయారుచేయాలని భావిస్తోంది. ఇటీవల ట్రంప్-మోదీ భేటీ సందర్భంగా కూడా టారిఫ్‌ల అంశం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వంటివి చర్చకు వచ్చాయి. దీంతోపాటు ఇరుదేశాల మధ్య వ్యాపారాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇక ప్రస్తుతం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వారం పాటు అమెరికాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఆయన అమెరికా వాణిజ్య మంత్రి హువార్డ్ లుట్నిక్‌తో భేటీ అయ్యారు. వాణిజ్య ప్రతినిధి గ్రీర్‌తో సమావేశం కానున్నారు.ప్రస్తుతం భారత్‌లో ఏటా 40 లక్షల కార్లు విక్రయిస్తున్నారు. దేశీయ సంస్థలకు ప్రపంచంలోనే అత్యంత రక్షణ కల్పించే మార్కెట్‌గా ఇది నిలిచింది. ఇక భారత్ ఇటీవల 30 వస్తువులపై సుంకాలను తగ్గించింది. వీటిల్లో అత్యున్నతశ్రేణి మోటార్ సైకిళ్లు వంటివి కూడా ఉన్నాయి.