మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంతీరప్రాంతంలోని దక్షిణ సింహాచలం పేరుగాంచిన శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం – శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక శాఖ, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్తంగా చర్యలు ప్రారంభించాయి.ఆధ్యాత్మిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఈ క్షేత్ర అభివృద్ధి కోసం ఇటీవల పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ, సాంకేతిక అధికారి సుబ్రహ్మణ్య రాజు, ఇతర సిబ్బందితో కలిసి స్వయంగా పర్యటించారు. ఈ సందర్భంగా భక్తులు, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి అవసరమైన పనులను గుర్తించారు.తదనంతరం గురువారం పర్యాటక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ సాంకేతిక అధికారులు ఆలయ ప్రాంగణంలో కొలతలు తీసి అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పాతకోటు కృష్ణవేణి సమన్వయంతో, పర్యాటక శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది, దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి భాగస్వామ్యంతో భవిష్యత్ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.అందరి సహకారంతో యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం అభివృద్ధి పనులు త్వరలోనే అమలు దిశగా ముందుకు సాగనున్నాయి.







