
మన న్యూస్ ,నెల్లూరు ,ఆగస్టు 8:వి ఆర్ హై స్కూల్ పై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మంత్రి పొంగూరు నారాయణ ఘాటుగా స్పందించారు. వైసిపివి అర్థంలేని ఆరోపణలంటూ మండిపడ్డారు. పనీపాట లేక పనికిమాలిన విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో విఆర్సి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చదివిన విఆర్సి ని అభివృద్ధి చేస్తుంటే కొందరు ఓర్వలేక పోతున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పేద పిల్లలకి అన్ని సదుపాయాలతో ఉచితంగా విద్యను అందించడమే తన లక్ష్యమన్నారు. అందులో భాగంగానే నారాయణ విద్యాసంస్థలకు చెందిన మెటీరియల్ సైతం ఇచ్చామని వ్యాఖ్యానించారు. విఆర్సి హై స్కూల్ ను చూసిన తర్వాత మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో కూడా ఓ స్కూల్ని ఆధునికరిస్తున్నారని స్పష్టం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. వి ఆర్ హైస్కూల్ తరహాలో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేస్తానన్నారు. ఇలాంటి చిల్లర విమర్శలు చేస్తే 11 స్థానాల నుంచి వైసీపీ జీరోకి పడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.
