

తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని.
Mana News , నూగూరు వెంకటాపురం, మార్చి 10, సోమవారం: వెంకటాపురం మండలంను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కోరుతూ మండల అభివృద్ధికి కావాల్సిన పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని గారు ములుగు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండలం అన్ని రంగాలలో అభివృద్ధికి చాలా వెనకబడి ఉందని, కాలం మారుతున్న, జనాభా పెరుగుతున్న, మండల కేంద్రంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నా గానీ మండల కేంద్రం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇకనైనా మండల అభివృద్ధి కొరకు పునరాలోచించాలని కోరారు. వెంకటాపురం మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ నుండి ఉమారామలింగేశ్వర గుడి వరకు రోడ్డు విస్తరణ చేసి, సెంట్రల్ లైట్ రోడ్ ఏర్పాటు చేయాలని, వెంకటాపురం మండల యువత ఉపాధి కొరకు రెండు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, వెంకటాపురం మండలం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, మండల కేంద్రంలో అంబేద్కర్, కొమరం భీమ్ కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేయాలని, వెంకటాపురం మండలంలో నడిచే ఇసుక క్వారీల ఆదాయం నుండి 80శాతం నిధులు మండల అభివృద్ధికి వినియోగించాలని, మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, చిన్న తరహా వ్యాపారస్తులకు మరియు కూరగాయల వ్యాపారస్తులకు శాశ్వత కూరగాయల మరియు జనరల్ మార్కెట్ నీ ఏర్పాటు చేయాలని, మండలంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, ఇల్లు లేని వాళ్లకు, గుడిసెలు, రేకుల ఇంటిలో ఉండే పేద వాళ్ళ అందరికీ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన అన్ని రోడ్లు పూర్తి చేయాలని, ప్రతి గ్రామంలో మంచి నీటి కొరత లేకుండా చూడాలని, వరంగల్ నుండి మేడారం మరియు ఏటురునాగరం మీదుగా వెంకటాపురం వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ, ఇంకా మొదలైన మండల అభివృద్ధి డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని కలెక్టర్ గారికి అందజేసినట్లు తెలిపారు. అలాగే వెంకటాపురం మండల అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రులను త్వరలో కలుస్తానని, వరంగల్ నుండి మేడారం మరియు ఏటూరునాగారం మీదుగా వెంకటాపురం వరకు రైల్వే లైన్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులను కలుస్తానని తెలిపారు.
