

Mana News :-హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మొన్నటి వరకు కొద్దిగా వర్షాలు పడి ఎండ నుంచి ఉపశమనం లభించిగా.. మళ్లీ ఎండలు మొదలయ్యాయి. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేటి నుంచి మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో 42 – 44 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 41 – 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, తరచూగా నీరు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళ, రేపు దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది