

Mana News :- తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) ఆదివారం కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసి ప్రముఖ విద్వాంసుడిగా ప్రసిద్ధికెక్కారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనవుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు వంటి కీర్తనలకు స్వరాలు సమకూర్చారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. 600లకుపైగా అన్నమాచార్య సంకీర్తనలకు ఆయన స్వర కల్పన చేశారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. గత శుక్రవారమే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త సంగీత ప్రియులను విచారంలో ముంచేసింది. గరిమెళ్ల మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి :- గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుంచి 2006 వరకు టీటీడీ ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ల.. 600కుపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన మహనీయుడని చంద్రబాబు కొనియాడారు. సంగీతంలో అమితమైన ప్రావీణ్యం కలిగిన గరిమెళ్ల తిరుమల శ్రీవారి సేవలో తరలించారన్నారు. తనదైన మధుర గాత్రంతో శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారని, అలాంటి వ్యక్తి మనల్ని విడిచి వెళ్లడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. గరిమెళ్ల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గరిమెళ్ల మృతిపై మంత్రి నారా లోకేష్, టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
