

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర తిమ్మయ్య (45) అనే వ్యక్తి భూర్లుల్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు వెంకటాపూర్ గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల వివరాల ప్రకారం..వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిమ్మయ్య ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామానికి చెందిన ఓ మహిళతో కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారు. బూర్గుల్ గ్రామ శివారులో గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో ఓ మగ వ్యక్తి మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో..సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిమ్మయ్యగా గుర్తించారు. పోలీసులు వివరాలు ఆరా తీస్తే బుధవారం సాయంత్రం ఓ మహిళతో కలిసి తిమ్మయ్య అటవీ ప్రాంతంలోకి వెళ్లి సాయంత్రం వరకు మద్యం సేవించినట్లు తెలిసింది. తీరా ఉదయం చూసేసరికి తిమ్మయ్య మృతి చెంది ఉన్నాడు. తన తండ్రి మృతి పై తనకు అనుమానం ఉందని విచారణ చేసి న్యాయం చేయాలంటూ మృతుడి కుమారుడు యేసుప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్,పిట్లం ఎస్ఐ రాజు, బీర్కూరు ఎస్సై రాజశేఖర్, ఏఎస్ఐ ఆబిద్ బేగ్ సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ కొనసాగించి మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.