మాదక ద్రవ్యాల రవాణా, చెలామణీపై పోలీసులు కఠిన హెచ్చరిక

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-

ప్రాంతంలో భద్రతా చర్యల భాగంగా ప్రార్థన మందిరాలు, ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లలో సింగరాయకొండ పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాల మేరకు ఈ తనిఖీలను సీఐ చావా హాజరత్తయ్య, ఎస్సై బండ్లమూడి మహేంద్ర తమ సిబ్బందితో చేపట్టారు.సింగరాయకొండ రైల్వే కూడలి మరియు జాతీయ రహదారి–16 సమీప ప్రాంతాలు మాదకద్రవ్యాల రవాణాకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించి, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్‌లో డాగ్ స్క్వాడ్ సహాయంతో బస్సులు, పార్సిల్ ఆఫీస్, ప్రయాణికుల సామాను తదితరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.తదుపరి పాత సింగరాయకొండలోని శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం, వరాహ లక్ష్మీ నారసింహ స్వామి కొండ పరిసరాల్లో కూడా పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో జల్లెడ పట్టారు.సీఐ చావా హాజరత్తయ్య మాట్లాడుతూ, “ప్రార్థన మందిరాలకు తరచూ ఆగంతకుల బెదిరింపులు వస్తున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ ప్రాంగణాలు, పరిసరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నాం,” అని తెలిపారు. అలాగే, “ఆర్టీసీ బస్టాండ్‌లు, బస్సులు మాదకద్రవ్యాల రవాణాకు వేదికలుగా మారకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మాదకద్రవ్యాల రవాణా లేదా చెలామణీ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ తనిఖీల్లో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *