తిరుపతి (ఆగష్టు 11):

రైలు ప్రయాణంలో అనుకోకుండా వదిలేసిన సుమారు రూ. 3 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని ఆర్‌పీఎఫ్ సిబ్బంది అత్యంత అప్రమత్తతతో స్వాధీనం చేసుకుని, సురక్షితంగా ప్రయాణికురాలికి అప్పగించారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఎం. కవిత (34) అనే మహిళ ఈ నెల 10న గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 17261) బి-2 కోచ్‌లో ప్రయాణిస్తూ, తన 24 గ్రాముల బంగారు చైన్‌ను దిండు కింద పెట్టి మర్చిపోయి తిరుపతిలో దిగిపోయారు. గమనించిన బాధితురాలు వెంటనే ‘రైల్ మదద్’ ద్వారా ఫిర్యాదు చేయగా, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఎం. సందీప్ కుమార్ పర్యవేక్షణలో ఏఎస్సై సి.ఎస్. చెట్టి, కానిస్టేబుల్ కె.సి.ఎం. నాయక్, టి. డెల్లిలతో కూడిన బృందం తక్షణమే రంగంలోకి దిగింది.

​తిరుపతి యార్డులో ఉన్న రైలు కోచ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పోయిన పసిడి ఆభరణాన్ని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మంగళవారం శ్రీవారి దర్శనం ముగించుకుని ఆర్‌పీఎఫ్ పోస్టుకు వచ్చిన కవిత దంపతులకు, ఐఆర్‌పీ వరప్రసాద్ సమక్షంలో తగిన ఆధారాలు పరిశీలించిన తర్వాత ఆభరణాన్ని అందజేశారు. వేగవంతంగా స్పందించి తమ విలువైన సొత్తును తిరిగి అందజేసిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది సమర్థతను, నిబద్ధతను ప్రయాణికులు కొనియాడుతూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికుల భద్రతతో పాటు వారి సొత్తు రక్షణకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా ఆర్‌పీఎఫ్ అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *