

గుడిపాల మన ధ్యాస సెప్టెంబర్-16 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని జెడ్‌పి హెచ్‌ఎస్ నరహరి పేట, శ్రీరంగంపల్లి, బొమ్మసముద్రం, కమ్మతిమ్మపల్లి తదితర పాఠశాలల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన నూతన మూల్యాంకన విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆచరణ సాధ్యం కానిది అని అన్నారు. ఎక్కువ సమయం పాఠ్యాంశాల బోధనకు కాకుండా, మూల్యాంకన పుస్తకాల నింపే పనిలోనే వృథా అవుతుందని, దీనివల్ల సకాలంలో పాఠ్యక్రమం పూర్తి చేయలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కావున పాత మూల్యాంకన విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిలను దశల వారీగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాలని, సరెండర్ సెలవు నగదు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డి.ఏ.ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా మహిళా కార్యదర్శి రాధాకుమారి, సంఘ నాయకులు గుణశేఖర్, సుబ్రహ్మణ్యం పిళ్లె, మునస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

