చిత్తూరు రూరల్ మన ధ్యాస సెప్టెంబర్-16
చిత్తూరు రూరల్ మండలంలోని సికేపల్లి, బంగారెడ్డిపల్లి, నర్సింగరాయనపేట, తాళంబేడు, చెర్లోపల్లి, ఏం అగ్రహారం, దొడ్డిపల్లి తదితర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.టి.యు జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డి ఏ లను మంజూరు చేయాలని, పన్నెండో వేతన సవరణ సంఘానికి కమిషనర్‌గా చైర్మన్ నియామకం చేపట్టాలని కోరారు. ఆలస్యం చేస్తే మధ్యంతర భృతి ముప్పై శాతం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వవలసిన గ్రాట్యుటీ ధనాన్ని వెంటనే చెల్లించాలని, సంపాదిత సెలవులకు సంబంధించిన నగదు బకాయిలను మంజూరు చేయాలని కోరారు. దసరా పండుగ కానుకగా పెండింగ్‌లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలని, లేనిపక్షంలో అక్టోబరు ఏడవ తేదీన విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ధర్నా నిర్వహించనున్నట్టు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమలుచేసి సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.టి.యు మహిళా కార్యదర్శి రాధా కుమారి, సంఘ నాయకులు సుబ్రహ్మణ్యం పిళ్ళై, గుణశేఖరన్, ఉపాధ్యాయులు మురళీధర్ రెడ్డి, పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.








