

నెల్లూరు / హైదరాబాద్, మే 4:– ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు సంస్కృతి, సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్న మాచవరం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటుడు దోర్నాల హరిబాబుకు “మహానంది” పురస్కారాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లా కు చెందిన దోర్నాల హరిబాబు గత రెండు దశాబ్దాలుగా రంగస్థల నటన, టెలివిజన్ కార్యక్రమాలు మరియు సినిమాల్లో హాస్యపాత్రల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ, తెలుగు హాస్యానికి తనదైన ముద్రవేశారు. సామాజిక సందేశాలు కలిగిన స్కెచులు, నటనలోని సహజత మరియు మాంద్యాన్ని దూరం చేసే చమత్కారపు డైలాగుల కోసం ఆయనకు విశేష గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా మాచవరం సేవా సమితి అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ, “తెలుగు ప్రజల ముఖాల్లో చిరునవ్వు తీసుకొచ్చే ప్రతి కళాకారుడు మా దృష్టిలో ఒక గొప్ప సేవాకారుడే. హరిబాబు నిరంతర కృషి, వినూత్న హాస్య శైలి మా ఫౌండేషన్ ను ఈ పురస్కారం ఇవ్వడానికి ప్రేరేపించింది” అని తెలిపారు.ఈ పురస్కార ప్రదాన కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త దైవజ్ఞ శర్మ, రచయిత మురళీ కృష్ణారెడ్డి, కళాకారుడు చారి, వ్యాఖ్యాత గాంధీ, మాచవరం గౌరీ శంకర్ శాస్త్రి తదితర ప్రముఖులు హాజరై హరిబాబుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రోతల కరతాళధ్వనులతో, హాస్యంతో నిండి ఉత్సాహభరితంగా సాగింది.