

మన న్యూస్,తిరుపతి, :- రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమని
ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. తిరుపతి కొర్లగుంట చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవాలయాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25 వేల రూపాయల కనీస వేతనాలు అమలు చేస్తూ జి ఓ ఎం ఎస్ నెంబర్ .130 ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని (44)6a ఎండోమెంట్ దేవాలయాలలో, కేశఖండనశాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు 20 వేల నుంచి 25 వేలకు వేతనం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందని వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని హర్షం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ప్రతి దేవాలయాల పాలకమండళ్లలో నాయి బ్రాహ్మణులకు ఒకరికి అవకాశం కల్పిస్తామని చెప్పారన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందిస్తామని, బీసీ రక్షణ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చి ఆ దిశగా ముందుకు వెళ్లడం జరుగుతోందని తెలియజేశారు. అలాగే 16,347 ఉపాధ్యాయ పోస్టులను సైతం భర్తీ చేయనున్నారని, ఆదరణ పథకం కింద చేతివృత్తులను, కుల వృత్తులను ఆదుకోవడానికి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కి బాటలు వేస్తున్న విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబునాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కే శ్రీనివాసులు, అరుణాచలం, రమణయ్య, రామచంద్ర, టీ మోహన్, వెంకటరత్నం బాబు, పెంచలయ్య, తదితర నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు