

Mana News :- టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏపీలో ఆయనపై నమోదైన కేసులపై నిన్న హైకోర్టు ఆరు వారాల పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. అంతలోనే ముంబై కోర్టు ఇవాళ ఆయన పిటిషన్ ను తోసిపుచ్చడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో వర్మకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీనిపై ఏం చేయాలనే అంశంపై లాయర్లతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ నిర్మాతకు రాంగోపాల్ వర్మకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆయన దాఖలు చేసిన కేసులో ముంబై కోర్టు స్పందించింది. రాంగోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు సదరు నిర్మాతకు 3.72 లక్షలు పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని కోరారు. అయితే వర్మ పిటిషన్ ను ముంబై కోర్టు తోసిపుచ్చింది. గతంలో విధించిన మూడు నెలల జైలు శిక్షను రద్దు చేసేందుకు ముంబై సెషన్స్ కోర్టు నిరాకరించింది. అయితే వర్మ జడ్జి ముందు హాజరై బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆప్షన్ ఇచ్చింది. అదే సమయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ను కూడా జారీ చేసింది. ఈ వారెంట్ అమలు కోసం కేసు విచారణ జూన్ 28కి వాయిదా వేశారు. దీంతో రాంగోపాల్ వర్మ తదుపరి చర్యలు తీసుకోకుండా ఏం చేయాలన్న దానిపై తన లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఏపీలో నమోదైన కేసుల విషయంలో న్యాయపోరాటం చేస్తున్న వర్మకు ముంబై కోర్టు ఉత్తర్వులు తలనొప్పిగా మారాయి.
