

మన ధ్యాస, ఐరాల సెప్టెంబర్-01 :- రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సోమవారం ప్రారంభించారు. పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండల కేంద్రంలోని వి.ఎస్.అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” పాల్గొన్నారు అంతకుముందు ఐరాల మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు ఎమ్మెల్యే మురళీమోహన్కి పూలమాలలు వేసి దుశ్శాలువతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ. “నిత్యవసర సరుకుల పంపిణీలో గతంలో చోటుచేసుకున్న అక్రమాలను అరికట్టే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, అందులో భాగంగానే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. అవినీతికి చెక్ పెడుతూ, న్యాయమైన విధంగా సరుకులు ప్రజలకు చేరేలా చేస్తాయని తెలిపారు. క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకొస్తున్నామని, దీనివల్ల ప్రతి లావాదేవీ రికార్డులోకి వస్తుందని, ప్రజలకు తగిన వాటా అందేలా పర్యవేక్షణ జరుగుతుంది అని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా సాగేందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని చెప్పినా ఆయన, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండలం అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్ బాబు, ఐరాల సింగల్ విండో ఛైర్మన్ శేషాద్రి నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ సుధాకర్ ఇతర ప్రజాప్రతినిధులు మరియు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
