

.శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి ; ప్రభుత్వ విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను కాపాడ్డంలో అలసత్వం వహిస్తూ, ప్రజల ప్రాణాలు, దేహాలు ప్రమాదంలో పడ్డానికి పరోక్షంగా కారణం అవుతున్నారనే కారణంతో కాకినాడ జిల్లా రోడ్లు, భవనాల శాఖ కాకినాడ సర్కిల్ ఎస్.ఇఇ, తుని సబ్ డివిజన్ డిఇఇ, రౌతులపూడి సెక్షన్ ఏఇలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రహదారులు భవనాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి శంఖవరం సామాజిక ఉద్యమకారుడు మేకల కృష్ణ ఫిర్యాదు చేసారు. కోటనందూరు – కత్తిపూడి ప్రజా రవాణా రోడ్డుపై నిత్యం పరిమితికి మించి (అధిక) బరువుతో లాటరైట్, గ్రావెల్, పెద్ద బండరాళ్ళను తరలిస్తున్న మైనింగ్ లారీల మాఫియాకు గత సంవత్సరం కాలంగా అనుకూలంగా తమ ఉద్యోగాలను నిర్వహిస్తూ అధిక బరువులను తరలిస్తున్న లారీలపై ఫిర్యాదులు చేసినప్పటికి వాటిని కట్టడి చేయకుండా కేవలం తమ కార్యాలయాలకే పరిమితమైన నేరంపై కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులకు మేకల కృష్ణ సోమవారం రిజిస్టర్డు పోస్టును పంపారు.లారీల మాఫియా రవాణా కార్యకలాపాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియంత్రించాలని ఏడాది కాలంగా ప్రజలు నిత్యం ఏదో రూపేణా ఉద్యమిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క లారీపై పోలీసులకు పిర్యాదు చేయకుండా, రోడ్డు దుస్దితిని పట్టించుకోకుండా అధిక బరువులు కల్గిన లారీల ఓనర్ల ప్రలోభాలకు తలొగ్గి రోడ్డు, ప్రజల మేలుకు కనీస విధులను నిర్వహించక పోవడాన్ని కృష్ణ ఆక్షేపించారు. కడపటి ప్రభుత్వ పాలనా కాలంలో సర్వనాశనమైన కోటనందూరు – కత్తిపూడి రోడ్డుకు జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరమత్తులు చేపట్టింది. ఈ అధికారుల నిర్లక్ష్యం, నిర్వాహకం కారణంగా మళ్ళీ ఈ రోడ్డుపైన గోతులు ఏర్పడ్డాయి. యధాతధంగా ధ్వంసమైంది. దీనిపై ప్రయాణిస్తున్న ప్రజలు కష్టాలు, ప్రమాదాల పాలవుతున్నారు. దీనంతటికీ కాకినాడ సర్కిల్ ఎస్ఇఇ, తుని డిఇఇ, రౌతులపూడి ఎఇఇల నిర్లక్ష్యపు విధి నిర్వహణా లోపమే కారణమని, వారి ఉద్యోగ విధి నిర్వహణా లోపాలపై శాఖాపరమైన దర్యాప్తు జరపాలనీ, ఆపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణ కోరారు. ఈ ఫిర్యాదుపై కూడా న్యాయం జరగకపోతే ఆర్ అండ్ బి కాకినాడ ఎస్ఇఇ, పెద్దాపురం డిఇఇ, రౌతులపూడి ఎఇలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసు నమోదు చేయిస్తామని, కోటనందూరు – కత్తిపూడి ప్రజా రవాణా రోడ్డుపై అధిక బరువులు కలిగిన లెట్రేట్, గ్రావెల్, పెద్ద బండరాళ్ళతో కమర్షియల్ లారీల మాఫియాకు సహకరించి తప్పు చేసిన ప్రతి అధికారినీ న్యాయస్థానంలో నిలబెడతామనీ ఆ లేఖలో శంఖవరం సామాజిక ఉద్యమకారుడు మేకల కృష్ణ హెచ్చరించారు.