

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, క్రీడల్లో అత్యున్నత స్థాయిలో రాణించేలా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. మఖ్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రవికుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ధ్యాన్ చంద్ వరుసగా మూడు ఒలింపిక్స్ లో ఒంటి చేత్తో భారత దేశానికి హాకీలో బంగారు పతకాలు తీసుకుని వచ్చాడని, ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.ఎలాంటి సదుపాయాలు లేని సమయంలో, హకీలో మంత్రముగ్ధులను చేస్తూ, ధ్యాన్ చంద్ చూపించిన ప్రదర్శన,అలనాటి జర్మనీ నియంత హిట్లర్ ను సైతం కట్టిపడేసిందని అన్నారు. ధ్యాన్ చంద్ మైదానంలో ఉంటే ప్రత్యర్థులు ఆశలు వదులుకునే వారని అన్నారు. అందుకే ధ్యాన్ చంద్ కు హాకీ మాంత్రికుడు అనే బిరుదు వచ్చిందని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తూ, సరికొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకు వచ్చిందని, క్రీడల్లో అత్యున్నత స్థాయికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. క్రీడలతో మెరుగైన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభించి అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. విద్యార్థులకు చిన్న నాటి నుంచే క్రీడలపై ఆసక్తి కలిగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రవికుమార్, మార్కెట్ డైరెక్టర్లు శ్రీనివాస్, ఫయాజ్, కట్టా వెంకటేష్, మందుల నరేందర్, బోయ వెంకటేష్, ఓబులేష్, అస్మొద్దీన్, కల్లూరి గోవర్దన్, బ్యాగరి సురేష్, తిరుమలాపూర్ నరసింహఅఫ్రోజ్, ఆనంపల్లి రమేష్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.