

ఉరవకొండ, మన న్యూస్: పట్టాదారుల సొంత భూముల్లో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పైపులైన్లు వేస్తూ గుత్తేదారులు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ భూమిలో గుత్తేదారు పైపులైన్ పనులు చేపట్టారని, దీనికి వ్యతిరేకంగా తాసిల్దార్, ఎంపీడీవోలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని ఆమె కుటుంబం ఆరోపించింది. భవిష్యత్తులో ఇల్లు కట్టే సమయంలో పునాదుల తవ్వకానికి పైపులైన్లు పెద్ద అవరోధం అవుతాయని, ముందస్తు ఆలోచన లేకుండా పనులు కొనసాగుతున్నాయని మహాలక్ష్మి దంపతులు విమర్శించారు. పైపులైన్లు వేరే మార్గంలో వేయాలని, సొంత స్థలాల్లో అనుమతుల్లేకుండా పనులు ఆపాలని వారు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, స్థానిక అధికారులను డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సిపిఎం మండల కార్యదర్శి, జిల్లా కౌలు రైతు సంఘం ఉపాధ్యక్షులు కూడా స్పందిస్తూ – పట్టాదారుల అనుమతి లేకుండా పనులు కొనసాగితే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.