

Mana News :- ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 72,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,545 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా నాలుగు కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉదయం 9:15 నిమిషాలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాల కోలాటాల మధ్య భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. వేలాదిమంది కోదండరాములవారిని దర్శించుకున్నారు. పూజలు చేశారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు అర్చకులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం, ఆస్థానాన్ని నిర్వహిస్తోన్నారు. సాయంత్రం 7 నుండి రాత్రి 8:30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది. శుక్రవారం ఉదయం 9 నుండి 10:30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇదే ఆలయంలో 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. నవమి రోజున ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. 7వ తేదీన ఉదయం ఉత్సవర్లను అభిషేకిస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. సాయంత్రం 7 నుండి రాత్రి 9:30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 7 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతా రామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
