

Mana News :- ఏపీలో మహిళల భద్రతకోసమంటూ గత వైసీపీ ప్రభుత్వం దిశ యాప్ ను తీసుకొచ్చింది. భారీ ఎత్తున మహిళలతో పాటు పురుషులతోనూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేయించారన్న విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే అంతే స్ధాయిలో మహిళల్ని వేధింపుల నుంచి కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన తర్వాత అప్పట్లో వైఎస్ జగన్ తెచ్చిన ఈ యాప్ ను పక్కనబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మండలిలో హోంమంత్రి ప్రకటన చేశారు. వైసీపీ దిశ యాప్ స్ధానంలో తాము శక్తి యాప్ తీసుకొస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. వైసీపీ తెచ్చిన దిశ యాప్ తో మగవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగిందని, కానీ తాము తెచ్చే శక్తి యాప్ తో మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అనిత తెలిపారు. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి 8న తాము శక్తి యాప్ ను మహిళల కోసం ప్రారంభిస్తామని ఇవాళ శాసన మండలిలో ప్రకటించారు.పని చేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి వైసీపీ ఎంఎల్‌సీ వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానం ఇచ్చారు. ఇందులో పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్‌హెచ్ చట్టం అమలు చేస్తామన్నారు.మహిళల రక్షణే ధ్యేయంగా ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసే వ్యవస్థ అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో చట్టపరమైన పరిణామాల అవగాహన కోసం అవగాహన కల్పిస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు.