యాదమరి, మన ధ్యాస నవంబర్-20: యాదమరి మండలంలోని ఏకైక బాలికల ఇంటర్‌మీడియట్ కాలేజీ కె. గొల్లపల్లె హైస్కూల్‌లో మాత్రమే ఉండటంతో, దానిని కో-ఎడ్యుకేషన్‌గా మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు స్థానిక శాసనసభ్యులు పూతలపట్టు యం.ఎల్.ఎ డాక్టర్ కలికిరి మురళీమోహన్కి విన్నవించాయి. మండలంలోని ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం సుమారు నాలుగు వందలకుపైగా బాలబాలికలు పదవ తరగతి చదువుతున్నారు. అయితే ఇంటర్ స్థాయిలో బాలురకు ప్రభుత్వ రంగంలో స్థానికంగా సౌకర్యాలు లేకపోవడంతో వారు చిత్తూరు పట్టణంలోని ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వెళ్ళాల్సి వస్తోంది. ఇది పేద కుటుంబాలకు ఆర్థికభారం పెంచడమే కాకుండా ప్రయాణ, భద్రతా సమస్యలను కూడా కలిగిస్తోందని ఉపాధ్యాయ నాయకులు వివరించారు. ఈ నేపథ్యంలో కె. గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను కో-ఎడ్యుకేషన్ కాలేజీగా మారుస్తే మండలంలోని విద్యార్థులందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు కోరారు. ఈ విన్నపాన్ని పి.ఆర్.టి.యు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె. కనకాచారి, జిల్లా తెలుగునాడు అధ్యక్షులు వై. మధుసూదన్, ఏ.పి.పి.జి.టి.ఎ రాష్ట్ర కౌన్సిలర్ కె. దామోదర రెడ్డి, పి.డి. చిట్టిబాబు, పి.ఆర్.టి.యు రాష్ట్ర కౌన్సిలర్ జె. భాస్కర్ రెడ్డి కలిసి యం.ఎల్.ఎ కి అందజేశారు.







