

వెదురుకుప్పం మన ధ్యాస; గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఘనంగా జరిగింది. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి. ఎం. థామస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టబడింది. గ్రామ ప్రజలకు సౌకర్యంగా, పారదర్శకంగా రేషన్ సరఫరా వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు ఈ రోజు గ్రామస్థులకు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక మండల తహసీల్దార్ బాబు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ – “ప్రజలకు న్యాయంగా, అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు చేరేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డులు ఆధునిక సాంకేతికతతో రూపొందించబడ్డాయి. వీటి ద్వారా క్వాలిటీ రేషన్ సరుకులు సులభంగా అందుబాటులోకి వస్తాయి” అని అన్నారు.కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ పాల్గొని మాట్లాడుతూ – “ఎమ్మెల్యే డాక్టర్ థామస్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. దీని ద్వారా బెనిఫిట్లు నిజమైన అర్హులకే చేరుతాయి” అని తెలిపారు.యువ నాయకులు భాష్యం సతీష్ నాయుడు, బొమ్మయ్యపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు పవన్ కుమార్ యాదవ్, లక్ష్మీకాంత్ నాయుడు, వీఆర్వో భీమయ్య తదితరులు పాల్గొని గ్రామ ప్రజలకు కార్డులను అందజేశారు.గ్రామ ప్రజలు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
