

మన ధ్యాస తవణంపల్లె ఆగస్టు 29:
ఈ రోజు అరగొండ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యకమనికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి హేమలత హాజరయి అక్షరమాల గొప్పదనమే మన తెలుగు భాష మహత్యానికి నిదర్శనం. అచ్చులు, హల్లులు పలికేటప్పుడు ముఖమంతా సహజంగా కదులుతూ వ్యాయామం జరుగుతుందని పూర్వం గురువులు చెప్పిన సత్యం మరోసారి గుర్తుచేసుకోవలసిందే. తెలుగు భాష తియ్యని తేనేలాంటిది. సుందరమైన, సుమధురమైన, మృదుత్వంతో కూడిన ఈ భాషలో మాటలే కాక, మనసులోని భావాలను చిత్రంలా ఆవిష్కరించవచ్చు. “తెలుగులో వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుంది” అనడం వర్ణమాలలోని మెలికల వల్లే. అచ్చులు పలికేటప్పుడు ముఖం మొత్తానికి వ్యాయామం జరగగా, హల్లులు పలికేటప్పుడు కంఠం, నాలుక, పెదవులు కదులుతాయి. దీని వలన ఆరోగ్య పరమైన లాభాలు కూడా కలుగుతాయి. క ఖ గ ఘ ఙ పలకడం వల్ల కంఠ భాగం కదులుతుంది. చ ఛ జ ఝ ఞ పలకడం వల్ల నాలుక మొదటి భాగం కదులుతుంది. ట ఠ డ ఢ ణ పలకడం వల్ల నాలుక మధ్యభాగం కదులుతుంది.త థ ద ధ న పలకడం వల్ల నాలుక చివరి భాగం కదులుతుంది. ప ఫ బ భ మ పలకడం వల్ల పెదవులు కదులుతాయి. య ర ల వ శ ష స హ ళ క్ష ఱ పలకడం వల్ల నోరు మొత్తం కదులుతుంది. తెలుగు భాష కేవలం సంభాషణే కాదు, సాంస్కృతిక వారసత్వం. తెలుగువారి ఇంటి ముంగిట ముగ్గు ఎంత అందంగా ఉంటుందో, అలానే తెలుగు మనస్సు కూడా చక్కగా ఉంటుంది. అందుకే అందరూ తెలుగు మాట్లాడాలి, తెలుగు వ్రాయాలి, తెలుగు పుస్తకాలు చదవాలి. తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం మనందరి జీవితంలో ప్రతిధ్వనించాలి. అని మండల వైద్యాధికారి హేమలత తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

