

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ బస్టాండ్, బ్యాంకుల వద్ద రద్దీ గల ప్రధాన చౌరస్తాల్లో దొంగతనాలు నిర్మూలించడానికి ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి మాట్లాడుతూ, మక్తల్ బస్టాండ్, బ్యాంక్ ల వద్ద అనుమానిత వ్యక్తులను ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని, బస్టాండ్ లో ప్రయాణికుల మాటున కొంతమంది వ్యక్తులు రద్దీగా ఉన్న సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బస్టాండ్ లో ప్రయాణికులు బస్సు ఎక్కి దిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని మరియు తమ విలువైన బంగారు వస్తువులను, బ్యాగులను, పర్సులను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు.అలాగే అపరిచిత వ్యక్తులు ఏమైనా తినుబండరాలిస్తే తీసుకోరాదని ప్రయాణికులకు సూచించారు. అలాగే బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి మరియు అమౌంట్ డిపాజిట్ చేయడానికి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాంకుల వద్ద దొంగలు మాట వేసి వెంట ఫాలో అయి దొంగతనాలకు పాల్పడుతున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కోరారు. మక్తల్ పరిధిలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీల్లో మక్తల్ పోలీసులు నరేష్, తిరుపతి పాల్గొన్నారు.