మన న్యూస్,తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో తాను 44 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యానని, ఇకపై బీసీ ఉద్యోగుల సాధన కోసం, బీసీ సంఘాల సమస్యల పరిష్కారం కోసం నిత్యం అందుబాటులో ఉంటానని టీటీడీలో ఇటీవల పదవీ విరమణ పొందిన రామచంద్రయ్య యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం రామచంద్ర యాదవ్, ఆయన సతీమణి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్ దంపతులకు బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నాయకులు భారీ గజ పూలమాల వేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ 44 సంవత్సరాల క్రితం టీటీడీలో ఉద్యోగిగా చేరి శ్రీవారి సేవలో తరించానన్నారు. టీటీడీలో ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేస్తూ బీసీ ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకోగలిగామన్నారు. అంతేకాకుండా సిఐటియు అధ్యక్షుడిగా పనిచేసిన టీటీడీ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పోరాటాలు చేశామన్నారు. ఇకపై బీసీ కులాల సమస్యల సాధన కోసం నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు పరిష్కారం కోసం బీసీ సంఘర్షణ సమితి వేదికగా పనిచేస్తానన్నారు. టీటీడీలో తాను ఎన్నో సంస్కరణలకు అప్పట్లో పునాది వేశానని గుర్తు చేశారు. భక్తులను బార్‌కోడింగ్ విధానం ద్వారా దర్శనానికి అనుమతించాలని విధానాన్ని ప్రవేశపెట్టాలని అప్పట్లో టిటిడి పాలకమండలి సభ్యులకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఆ సమస్య పరిష్కారం కాకుండా పోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆ సంస్కరణను టీటీడీలో అమలు చేసేలా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. టీటీడీలో తాను తాత్కాలికంగా రిటైర్ అయినప్పటికీ తిరుమలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యనైనా, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పోరాటం చేస్తానన్నారు. నా 44 ఏళ్ల ఉద్యోగ విధి నిర్వహణ విజయవంతంగా పూర్తి కావడానికి నా సతీమణి పుష్పవతి యాదవ్ సహకారం లేనిదే చేయలేనని, తాను టీటీడీలో ఉద్యోగం చేసేటప్పుడు పిల్లలపట్ల పూర్తి బాధ్యతాయుతంగా తన సతీమణి పుష్పవతి యాదవ్ దగ్గరుండి వారి బాగోగులు చూసుకుని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు నా సతీమణి సహకారం ప్రోత్బలం లేనిదే ఇంతటి గుర్తింపు వచ్చేది కాదని రామచంద్ర యాదవ్ తెలిపారు. బీసీ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి లక్ష్మయ్య, బీసీ సంఘర్షణ సమితి నేతలు బివి కేశవులు ఉదయార్, అశోక్ సామ్రాట్ యాదవ్, ఆవులపాటి బుజ్జి బాబు మాట్లాడారు. భవిష్యత్తులో రామచంద్రయ్య యాదవ్ సేవలను బీసీ సంఘర్షణ సమితిలో బీసీ కులాల సమస్యల సాధన కోసం వినియోగించుకుంటామని, ఆయనలో నిబద్ధత, ఏదైనా సాధించాలనే తపన ఉన్న వ్యక్తి రామచంద్రయ్య యాదవ్ అని కొనియాడారు. రజక సంఘం నేత అశోక్ పాల్గొన్నారు.
