

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) :- జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు నేతృత్వంలో పార్టీ శ్రేణులు శాంతి ర్యాలీ చేపట్టాయి. ప్రత్తిపాడు లో మెయిన్ రోడ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సరైన బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ విచక్షణ రహితంగా పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాద సంస్థలను అనిచివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి దాడులు చేయడం ఎంతో హేయమైన చర్య అని ఈ దాడిలో అమాయకులు నిండు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కిరాతకులను కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో ఇలాంటివి పునరావృతం కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి నినదించాలన్నారు. తప్పు చేసిన వారిని అణిచివేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
