

మన న్యూస్, నారాయణ పేట:సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిపారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే అందేలా చూడాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు,గతంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో అన్ని రాష్ట్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని, దీంతో అన్ని రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో మరోసారి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా మక్తల్ నియోజకవర్గానికి 175 కోట్లతో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని, నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని సూచించారు. పార్టీలకతీతంగా, ఎలాంటి భేషజాలకు పోకుండా పూరి గుడిసెలు, పెంకుటిల్లలో నివసిస్తున్న వారి వివరాలు తీసుకొని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. రాబోయే రోజుల్లో మరో 100 కోట్ల రూపాయలతో మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను సైతం తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మక్తల్ నియోజకవర్గం లో 3500 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఇంటి నిర్మాణ సమయంలో ఫోటోలు దిగి తాను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిలేటి సుధాకర్ రెడ్డి గార్లకు పంపించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తానని సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. ఇటీ సమావేశంలో నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
