

Mana News ,నెల్లూరు:- వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి, సోదరుల వివాదం పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా తీసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికొచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈఘటన నెల్లూరులో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఆచారి వీధికి చెందిన రాజ్‌మల్‌జైన్‌కు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు దిలీప్‌కుమార్‌జైన్, మూడో కుమారుడు మనోజ్‌కుమార్‌జైన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. రెండో కుమారుడు హితేష్‌కుమార్‌జైన్ అలియాస్ జతిన్‌జైన్ వ్యసనాలకు బానిసై వివాహానంతరం శిఖరం వారి వీధిలో వేరుగా ఉంటున్నాడు. తండ్రి నుంచి ఇప్పటికే రూ.40 లక్షలు తన వాటాగా తీసుకున్నాడు. ఆ నగదుతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు. అయిదు సంవత్సరాల నుంచి సుబేదారుపేటలో దుర్గ గ్లాస్, ప్లైవుడ్ దుకాణం నిర్వహిస్తుండగా నష్టాలు వచ్చాయి. అప్పటినుంచి ఆస్తిలో వాటా కావాలని తల్లిదండ్రులు, అన్నదమ్ములను వేధిస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి తండ్రితో గొడవ పడుతున్నాడు. ఈ నెల 11న వచ్చి ఆస్తి పంపకాలు చేస్తారా? లేకుంటే తుపాకీతో కాల్చుకుంటానని బెదిరించాడు. పేలకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. శనివారం అర్ధరాత్రి అయిదుగురితో వచ్చి ఇంటి తలుపులు తెరవాలని గొడవ చేశాడు. కేకలు వేస్తూ బీభత్సం సృష్టించాడు. ఎవరూ రాకపోవడంతో లైసెన్సు కలిగిన పిస్తోల్‌తో ఒక రౌండు ఇంటి తలుపులపై కాల్చాడు.
ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. భయాందోళనలో ఉన్న బాధితులు ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నబజారు పోలీసులను అప్రమత్తం చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడితో పాటు అతని వెంట వచ్చిన అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తుపాకీతో కాలుస్తున్న హితేష్