తిరుపతి, (మన ధ్యాస), సెప్టెంబర్ 27: తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ కొనసాగుతున్న ఉద్యమానికి వివిధ ఆటో యూనియన్లు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. ఆదివారం బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ నివాసానికి తిరుపతి రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, తిరుచానూరు రైల్వే స్టేషన్ల పరిధిలోని వివిధ ఆటో యూనియన్ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గిరిధర్ కుమార్ చేపడుతున్న నిరంతర ఉద్యమాన్ని అభినందించారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం చేపట్టే భవిష్యత్ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని ఏకగ్రీవంగా ప్రకటించారు. తిరుపతి అభివృద్ధికి బాలాజీ రైల్వే డివిజన్ కీలకం ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ మాట్లాడుతూ తిరుపతిని కేంద్రంగా చేసుకుని బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు. రైల్వే డివిజన్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యాపారులు, చిన్నతరహా వర్తకులకు వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు, విద్యార్థులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే దేశ, విదేశీ భక్తులకు రైల్వే సేవలు, మౌలిక వసతులు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. తిరుపతి ప్రాంత ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, రవాణా సౌకర్యాల మెరుగుదల వంటి అంశాల్లో బాలాజీ రైల్వే డివిజన్ కీలకంగా ఉంటుందని గిరిధర్ కుమార్ పేర్కొన్నారు. ఉద్యమానికి పూర్తి సహకారం అందిస్తాం గిరిధర్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆటో యూనియన్ నాయకులు స్పందిస్తూ బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం చేపట్టే ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. డివిజన్ ఏర్పాటు కోసం భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని, ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, తిరుచానూరు రైల్వే స్టేషన్ పరిధికి చెందిన ఆటో యూనియన్ నాయకులు ఓబుల్ రెడ్డి, నవీన్, రైల్వే బాల, సూరి, రమేష్, వెంకటరమణ, కుమార్, గోవింద్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, పార్వతి, తులసి తదితరులు పాల్గొన్నారు.

