తవణంపల్లె, మనద్యాస, అక్టోబర్ 18: తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామ పరిధిలోని ముక్కోండ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెరటాసి నెల చివరి వారం — ఐదవ శనివారంలో స్వామివారికి అభిషేకం, అన్నదానం నిర్వహించడం ఈ ప్రాంతంలోని పూర్వకాలపు సాంప్రదాయం. ఆ ఆనవాయితిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఉదయం నుంచే స్వామివారి సేవలు ఘనంగా సాగాయి. ఉదయం 5.00 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమై, 7.00 గంటలకు ప్రత్యేక పూజలు, 11.00 గంటలకు క్షీరాభిషేకం, 11.30 గంటలకు శ్రీనివాసాలయ అర్చన నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12.00 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా జి. భాస్కర్ రెడ్డి దంపతులు, జి. చంద్రశేఖర్ రెడ్డి దంపతులు వ్యవహరించి ఉత్సవాలను విజయవంతం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొండ ప్రాంతం అంతా “గోవిందా… గోవిందా…” నినాదాలతో మారుమోగింది. సాయంత్రం శ్రీ సీతారాముల ఊరేగింపు గ్రామ పురవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాణాసంచా, వాయిద్య ఘోషల నడుమ భక్తులు హర్షాతిరేకంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంగంపల్లె గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. ఉభయదారులుగా వ్యవహరించిన జి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని, మరియు జి. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని గ్రామస్తులు దుసాలవతో సత్కరించారు. ఆలాగే వచ్చే సంవత్సరం ఉభయదారులుగా పదవి విరమణ చేసిన సైనిక ఉద్యోగి ఈ మధుసూదన్ రెడ్డి వ్యవహరించడానికి ముందుకు వచ్చారు.










