వెదురుకుప్పం,మన ధ్యాస ,అక్టోబర్ 16 :చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో టిడిపి నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెదురుకుప్పం పోలీసులు వికృతంగా వ్యవహరిస్తున్నారని, ముగ్గురు కానిస్టేబుళ్లు దేవళంపేటకు చెందిన అరుణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని తప్పుడు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేశారని తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మరియు వైసిపి నుంచి టిడిపిలో చేరిన కొందరు కోవర్టులతో పోలీసులు చేతులు కలిపి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.సోమవారం రాత్రి తిరుపతిలో నివాసం ఉన్న యువకుడు అరుణ్‌ను వెదురుకుప్పం పోలీసులు తీసుకెళ్లి, తీవ్రమైన హింసకు గురి చేశారని తెలిపారు. టిడిపి నేతలు కిషన్ చంద్, సతీష్ నాయుడు ప్రేరణతో తాగి విగ్రహానికి నిప్పు పెట్టినట్టు చెప్పాలని బలవంతం చేశారని, అంగీకరించకపోవడంతో కాళ్లకు గొలుసులు వేసి, కిటికీలకు కట్టేసి, కర్రలతో సీసీ కెమెరాలు లేని చోట కొట్టారని సుధాకర్ రెడ్డి తెలిపారు.అయన వివరించిన మేరకు, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో బుధవారం పోలీసులు అరుణ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.ఈ కుట్ర వెనుక మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, వైసిపి నుంచి టిడిపిలో చేరిన కోవర్టుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పోలీసులు రూ.10 లక్షలు తీసుకుని ఈ నాటకానికి వేదికయ్యారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు.“న్యాయం జరిగే వరకు మేము మౌనం పాటించము. ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేసి, నిందిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కుట్ర వెనుక ఉన్నవారి అసలు ముఖాలు బయటపెట్టాలి,” అని డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.– డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డిటిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి









