

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ప్రముఖ నాటక నటుడు మరియు సినీ నటుడు గుంజి చిన్న వెంకటేశ్వర్లు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు సుమారు 78 సంవత్సరాలు.వెంకటేశ్వర్లు గారు సుదీర్ఘ కాలం పాటు A.S.S.T. ఎలిమెంటరీ స్కూల్, సుందర్‌నగర్, సింగరాయకొండలో హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఉపాధ్యాయ వృత్తిలోనే కాదు, కళా రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేసారు.వారు అనేక వేదికలపై నాటకాలు ప్రదర్శించగా, చింతామణి నాటకంలో “సుబ్బిశెట్టి” పాత్ర ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. భావావేశం, స్వరపాటవం, పాత్ర జీవం వంటి అంశాలలో ఆయన నటన ప్రత్యేకమైనదిగా నిలిచింది.సినీ రంగంలో కూడా ఆయన పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ముఖ్యంగా “ఎర్రమందారం” (1991) మరియు “సగటు మనిషి” (1988) వంటి చిత్రాలలో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.వెంకటేశ్వర్లు నాటకరంగాన్ని సామాజిక బాధ్యతగా భావించి, దాని ద్వారా సమాజంలో చైతన్యం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆయన మృతితో కళారంగం ఒక ఆదర్శవంత కళాకారుడిని కోల్పోయింది.వారి మృతిపట్ల కళా రంగం ప్రతినిధులు, వడ్డెర సంఘం నేతలు, విద్యా రంగ స్నేహితులు, గ్రామస్థులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారు అనేక విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన గురువు, అనేక కళాకారులకు ప్రేరణగా నిలిచిన నటుడు. మృతదేహాన్ని బంధుమిత్రులు, అభిమానులు సందర్శించి, ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు.