

మన న్యూస్, చిత్తూరు, మార్చి 6 : వీర సైనికుల త్యాగాలు అజరామరమని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు బ్రిగేడియర్ వివి రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ క్రమంలో వివి రెడ్డి స్థానిక మురుకంబట్టుకు చెందిన వీర సైనికుడు చంద్రశేఖరరెడ్డి సతీమణి కుసుమ, స్థానిక ఓటి చెరువు కు చెందిన నవీన్ కుమార్ సతీమణి ఉమామహేశ్వరి, బంగారుపాళ్యం మండలం పామినివాండ్ల ఊరు కు చెందిన సురేష్ బాబు సతీమణి ఇందిరాల సరిత నివాసాలకు వెళ్లి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కాసేపు ఆయా కుటుంబాలతో ముచ్చటించారు. ధైర్యంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారికి సూచించారు. అనంతరం చిత్తూరు నగరంలోని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి చేరుకొని మాజీ సైనికుల సమస్యలపై కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితో చర్చించి పలు సూచనలు, సలహాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వివి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులను మంజూరు చేస్తాయని వెల్లడించారు. అనంతరం మాజీ సైనికులతో సమావేశా ఏర్పాటు చేసి పది అంశాలపై చర్చించారు కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ ప్లేస్ మెంట్ అధికారి బీవీ రెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కే రాఘవులు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు పళని, సురేంద్రబాబు, రాజన్, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
