

Mana News :- రాష్ట్రంలో సంచలనం రేపిన బియ్యం అక్రమ రవాణా పై మంత్రి మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసారు. గత అయిదేళ్లు కాలంలో రాష్ట్రంలో జరిగిన బియ్యం రవాణా పైన వివరాలు కోరామని వెల్లడించారు. పూర్తి సమాచారం వచ్చిన తరువాత చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. బియ్యం అక్రమ ఎగుమతి నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గతంలో బియ్యం అక్రమ రవాణాకు కారకులుగా ప్రచారం జరిగిన వారి విషయంలో చర్యల పైన టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర ప్రశ్నించారు. త్వరలోనే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని మనోహర్ చెప్పారు.విచారణ చేస్తున్నాం :- అసెంబ్లీలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, అరికట్టే చర్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రేషన్ బియ్యం కేజీకి 46 .10 రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పీడీఎస్ రైస్ కోసం వినియోగిస్తున్నామని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం వ్యవస్థీకృతం గా పీడీఎస్ రైస్ అంటే స్మగ్లింగ్ రైస్ గా మార్చేసారని చెప్పుకొచ్చారు. అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీ డీ యాక్ట్ లలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామని మంత్రి వెల్లడించారు. కాకినాడ పోర్ట్ లో 50 వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేసి 25 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ గా గుర్తించామని వివరించారు. చర్యలు ఉంటాయి :- త్వరలో క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డు లు ఇవ్వబోతున్నట్లు మనోహర్ ప్రకటించారు. ఈకేవైసీ, ఏఐ కెమెరాల సహాయంతో అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మనోహర్ సమాధానం వేళ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. బాధ్యులైన వారి పైన చర్యలు ఉంటాయని మంత్రి మరోసారి స్పష్టం చేసారు. గత ఐదేళ్ల కాలంలో రేషన్ బియ్యానికి సంబంధించిన లెక్కలు తీస్తున్నామని వివరించారు. పూర్తి వివరాలు రావాల్సిన అవస రం ఉందని చెప్పుకొచ్చారు. మచిలీపట్నం గోడౌన్ లతో పాటు రాష్ట్రంలో కాకినాడ . బేతంచర్ల గోడౌన్ల కు సంబంధించి తనిఖీలు జరుగుతున్నాయని వెల్లడించారు. నరేంద్ర నిలదీత :- కాగా, మచిలీపట్నం జెఎస్ వేర్ హౌస్ లో ఎందుకు తనిఖీలు పూర్తి స్థాయిలో జరగలేదని ప్రశ్నిం చారు. పేదల బియ్యం దోచేసి నీతి వాక్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. స్టాక్ లో ఉన్న తేడా లు ఎందుకు గుర్తించలేదని నిలదీసారు. అధికారులు.. రేషన్ మాఫియా కుమ్మక్కు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి సమాధానంగా మంత్రి నాదెండ్ల మచిలీపట్నం జెఎస్ వేర్ హౌస్ లో తనిఖీ జరిగిందని చెప్పారు. వారి దగ్గర నుంచి ఇప్పటికే కోటి 70 లక్షల వరకు రికవరీ జరిగిందని వివరించారు. ఇంకా అధికారులు విచారణ చేస్తున్నారని సమాధానం ఇచ్చారు. సభ్యలు అడిగిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలో అన్ని విషయాలు బయటి కి వస్తాయన్నారు. దీంతో, ఈ కేసులో ప్రభుత్వం తదుపరి చర్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
