యాదమరి, మన ధ్యాస డిసెంబరు-12 కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఎస్‌టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను స్పష్టంగా ప్రస్తావించారు. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు అమలవుతున్న వందరోజుల కార్యక్రమం కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెలవు రోజుల్లో వందరోజుల కార్యక్రమాల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా ఉమ్మడి సేవా నియమావళిని అమలు చేయడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు పండిట్ పదోన్నతులు కల్పించాలని, చిత్తూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గణితం, సామాజిక శాస్త్రం, జీవశాస్త్ర విభాగాల పదోన్నతులు వెంటనే చేపట్టాలని కోరారు. స్పెషల్ ఎడ్యుకేషన్ ఖాళీ పదవులకు ఎస్‌జీటీలు నుండి పదోన్నతులు ఇవ్వాలన్న విషయంపై కమిషనర్‌కు రాష్ట్ర సంఘం ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు సుమారు ముప్పై వేలు కోట్ల రూపాయలు దశలవారీగా విడుదల చేయాలని, పిఎఫ్, ఎపిజిఎల్‌ఐ రుణాల మంజూరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, నిల్వలో ఉన్న సంపాదిత సెలవుల నగదు కోతలు, పెండింగ్‌లో ఉన్న డిఎలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పన్నెండు పిఆర్‌సికి సంబంధించిన కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని, ఉపాధ్యాయులకు ముప్పై శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని కూడా ఆయన స్పష్టంగా అభ్యర్థించారు. ఉపాధ్యాయుల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ చేపట్టి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎస్‌టియు రాష్ట్ర సంఘాన్ని మదన్ మోహన్ రెడ్డి కోరడంతో సమావేశ ప్రాంగణంలో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *