

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మహిళలు ఆర్థికంగా ఎదిగితే జిల్లా, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత మాత అని పేరుందని, రాష్ట్రానికి తెలుగు తల్లి ఉందని, అన్ని నదులు కూడా మహిళల పేర్లతోనే ఉన్నాయని మహిళకు అంత శక్తి ఉందని ఆయన చెప్పారు. శనివారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మక్తల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డా వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రికి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత, నర్వ, ఉట్కూర్ మండలాల్లోని మహిళా సమాఖ్య సంఘాలకు 1,08,00,000/-(ఒక్కకోటి ఎనిమిది లక్షల రూపాయలు)లతో ప్రభుత్వం అందించిన 3 ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను, 10 లక్షల వ్యయం గల సంచార చేపల విక్రయ కేంద్ర వ్యాన్ ను ప్రారంభించారు.అనంతరం ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి, కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ముందుగా మంత్రి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం మహిళల ప్రగతికి పెద్దపీట వేసిందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైన పావలా వడ్డీ పథకాలు నేడు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలోని రేవంత్ ప్రభుత్వంలో మళ్ళీ అమలు అవుతున్నాయని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతో పాటు బస్సులకు వారినే యజమానులను చేస్తున్నామన్నారు. ఒకప్పుడు ఒక మహిళ హైదరాబాద్ వెళ్ళి రావాలంటే 700 బస్సు ఛార్జీలు అయ్యేవని, కానీ ఇప్పుడు 7 పైసల ఖర్చు లేకుండా వెళ్లి రావచ్చన్నారు. మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. ఉచిత కరెంటు పథకం కింద మక్తల్ నియోజకవర్గంలో నెలకు రూ.72 లక్షలు చెల్లించడం జరుగుతుందని చెప్పారు. కళ్యాణ లక్ష్మి షాదీముబాకర్ ఆర్థిక సహాయాన్ని కూడా మహిళల పేరిటనే ఇస్తున్నామన్నారు. గతంలో ఏడాదికి ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే ఇప్పుడు మూడు నెలలకు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ అంటూ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, తాము నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను 175 కోట్లతో పార్టీలకు అతీతంగా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా నిర్మించి ఇస్తున్నామన్నారు. మక్తల్ నియోజకవర్గంలో 12 వేల ఇందిరమ్మ ఇండ్లు అవసరమని, కానీ మొదటి విడతగా 3500 ఇస్తూ, 8 ట్రిప్పుల ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మహిళలను వంటింటి కుందేళ్లుగా చేయాలనుకున్నదని, కానీ తమ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పం తీసుకున్నదని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బాగుంటే ఊరు, కుటుంబాలు, గ్రామాలు బాగుంటాయన్నారు. తమ పిల్లల కు మంచి చదువులు చెప్పించేందుకు తల్లులు తాపత్రయ పడతారని, అందుకే 200 కోట్లతో 24 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మక్తల్ లో నిర్మిస్తామన్నారు. ఇందిరా మహిళా క్యాంటీన్ ల పేరుతో మహిళా సంఘాల ద్వారా క్యాంటీన్ లను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం 2845 మహిళా సంఘాలకు 2023-24 మరియు 2024-25 సంవత్సరంలో వడ్డీలేని 8,28,31,000/- రుణాలను అందించిందని మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇంద్ర మహిళా శక్తి పేరిట 119 నియోజకవర్గాలలో సంబరాలు చేస్తున్నారని, ఇప్పుడు మక్తల్ లో ఇంత ఘనంగా సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళా శక్తి లో భాగంగా జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశామని, త్వరలో జిల్లాలోని అన్ని మండలాలలో పెట్రోల్ బంక్ ల ఏర్పాటుకు చేసేందుకు మంత్రి సూచించినట్లు ఆమె తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనంతరం ఆత్మకూర్, మక్తల్ మండలాల మహిళా సమాఖ్య సంఘాలకు ఇందిరా మహిళా శక్తి సోలార్ పవర్ ప్లాంట్ ల కోసం 6,00,00,000/-(ఆరుకోట్ల రూపాయలు) చెక్కును కలెక్టర్ తో కలిసి అందజేశారు. ప్రమాద భీమా చెక్కులను, మినీ గోదాముల చెక్కులను, లోన్ భీమా చెక్కులను మహిళా సమాఖ్య సంఘాలకు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ మొగులప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, కార్యదర్శి, కోశాధికారి, జిల్లాలోనీ అన్ని మండల సమాఖ్యల అధ్యక్ష కార్యదర్శులు,డిపిఎం,సిసిలు,మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు, అధికారులు, అనదికారులు పాల్గొన్నారు.